ప్రజావేదిక విషయంలో చంద్రబాబుకి వైసీపీ షాక్ ఇచ్చింది. ప్రతిపక్ష నేత హోదాలో అధికారిక కార్యకలాపాల కోసం ప్రజావేదికను తనకు కేటాయించాలని సీఎం జగన్ కు చంద్రబాబు ఇప్పటికే లేఖ రాయగా.. ఆయనకు కౌంటర్ ఇస్తూ వైసీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. పార్టీ-ప్రభుత్వం మధ్య సమన్వయం కోసం కార్యక్రమాలకు ప్రజావేదిక అనువుగా ఉంటుందని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రజావేదిక అక్రమకట్టడమని అధికారులు నిర్దారిస్తే.. తక్షణం ఖాళీ చేసి ఇవ్వడానికి సిద్ధమన్నట్లు రఘురాం తెలిపారు. టీడీపీ, వైసీపీలు ప్రజావేదికను తమకే కేటాయించాలంటూ కోరుతుండడంతో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉండవల్లిలోని ప్రజావేదిక భవనాన్ని తన నివాసానికి అనుబంధ భవనంగా అధికారికంగా కేటాయించాలని కోరుతూ జగన్‌మోహన్‌రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం లేఖ రాసిన విషయం తెలిసిందే.

prajavedika 06062019

ఉండవల్లిలో తాను ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రైవేటు భవనంలోనే ఇకపైనా కొనసాగనున్నానని, ఆ నేపథ్యంలో తన నివాసానికి పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని అధికారిక కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి, శాసనసభాపక్ష సమావేశాల నిర్వహణకు, సందర్శకులను కలవడానికి వీలుగా అనుబంధ భవనంగా ప్రకటించాలని ఆయన కోరారు. ‘‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజావేదికను నా నివాసానికి అనుబంధ భవనంగా ప్రకటించాం. చుట్టుపక్కల ఖాళీ ప్రదేశమేదీ లేని నేపథ్యంలో వివిధ సమావేశాల నిర్వహణకు, సందర్శకులను కలవడానికి ఆ భవనాన్నే వినియోగిచాం. నేను నివసిస్తున్న ప్రైవేటు భవనంలోనే...ఆ భవన యజమానితో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఇకపైనా కొనసాగుతాను. నేను శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికైన విషయం మీకు తెలుసు. ఆ నేపథ్యంలో నా నివాసానికి పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని నా అధికారిక కార్యకలాపాల కోసం ఉంచుకోవాలని భావిస్తున్నాను. అనుబంధ భవనంగా ప్రకటించాలని కోరుతున్నాను. నా విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయమని కోరుతున్నాను’’ అని జగన్ కు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాసిన లేఖను రాజకీయంగా చూడటం గర్హనీయమని టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణడు అన్నారు. వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్వీట్‌పై స్పందించిన ఆయన మాట్లాడుతూ విజయసాయి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. కొత్త ప్రభుత్వానికి చంద్రబాబు రాసింది..మొదటి లేఖ కాదని.. ఈ విషయం విజయసాయిరెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. సమగ్రాభివృద్ధి, పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని గతంలోనే చంద్రబాబు జగన్‌కు లేఖ రాశారని యనమల గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చినా.. వైసీపీ నేతలు అబద్ధాలు మానడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. విలాసవంతమైన భవనాలు ఊరికొకటి చొప్పున.. ఎవరికి ఉన్నాయో అందరికీ తెలిసిందేనని యనమల అన్నారు.

vsreddy 06062019

కృష్ణా నది కరకట్టపై తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని టీడీపీకి కేటాయించాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం చంద్రబాబు నుంచి జగన్‌కు లేఖ వెళ్లినప్పటికీ ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. తాజాగా.. ఈ వ్యవహారంపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. " సీఎం జగన్ గారికి చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యల పైన ఉంటుందనుకున్నాం. 40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా..? పోతుందా..? అనే సంశయం తప్ప ఇంకేమీ కనిపించడం లేనట్టుంది. ప్రపంచం మొత్తాన్నిఅమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా?" అని విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు.

టీడీపీ అధినేత ఇవ్వజూపిన లోక్ సభ విప్ పదవిని వద్దని కలకలం రేపి, ఆపై చంద్రబాబుతో రెండు గంటల పాటు చర్చించి, తనకు ఏ పదవీ వద్దని, పార్టీలోనే ఉంటానని స్పష్టం చేసిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఈ ఉదయం తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ ఆసక్తికర ట్వీట్ పెట్టారు. శ్రీశ్రీ రచనల్లోని ఎంతో పాప్యులర్ అయిన వాక్యం "పోరాడితే పోయేదేమి లేదు. బానిస సంకెళ్ళు తప్ప..." అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయింది. దీన్ని చూసిన ఆయన అభిమానులు కేశినేని ఏదో అసంతృప్తితో ఉన్నారని, కీలక నిర్ణయం ఏదో తీసుకోనున్నారని కామెంట్లు చేస్తున్నారు. లోక్‌సభలో పార్టీ విప్‌ పదవి తీసుకోవడానికి ఆయన నిరాకరిస్తూ, తన నిర్ణయాన్ని బుధవారం ఉదయం తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పెట్టారు. ఆయన పార్టీని వీడబోతున్నారన్న ప్రచారానికి ఇది దారితీసింది. సాయంత్రం ఆయన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిసి తన అసంతృప్తికి కారణాలను వివరించారు.

nani 06062019

తాను పార్టీ మారడం లేదని, టీడీపీలోనే ఉండి పనిచేస్తానని, ఆ తర్వాత ఆయన మీడియా వద్ద ప్రకటించారు. మంగళవారం రాత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో లోక్‌సభలో టీడీపీ తరఫున విప్‌గా, ఉప నేతగా నాని పేరును ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. లోక్‌సభకు టీడీపీ తరఫున ఈసారి ముగ్గురు ఎంపీలు గెలిచారు. ఈ ముగ్గురూ రెండోసారి గెలిచినవారే. వీరిలో గల్లా జయదేవ్‌ను పార్లమెంటరీ పార్టీ నేతగా, కింజరాపు రామ్మోహన్‌నాయుడును లోక్‌సభ పక్ష నేతగా గతంలోనే ప్రకటించారు. నానికి విప్‌ బాధ్యతలపై ఇప్పుడు నిర్ణయం తీసుకొన్నారు. ఈ పదవి తీసుకోలేకపోతున్నానంటూ నాని తన ఫేస్‌బుక్‌ పేజీలో బుధవారం ఉదయం పోస్టింగ్‌ పెట్టారు.

nani 06062019

‘నన్ను లోక్‌సభలో పార్టీ విప్‌గా నియమించిన పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. కానీ ఇంత పెద్ద పదవిని నిర్వహించడానికి నేను సరిపోనని భావిస్తున్నాను. నా కంటే మరింత సమర్థుడిని ఆ పదవిలో నియమిస్తే బాగుంటుందని నేను ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాను. విజయవాడ ప్రజలు నన్ను ఆశీర్వదించి తమ ఎంపీగా ఎన్నుకొన్నారు. ఈ పదవుల కన్నా విజయవాడ ప్రజలకు పూర్తి సమయం వెచ్చించి పనిచేయడం నాకు ఆనందం. నాపై నమ్మకం ఉంచిన చంద్రబాబు గారికి మరోసారి కృతజ్ఞతలు. నాకు ఇచ్చిన పదవిని తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు’ అని నాని అందులో పేర్కొన్నారు.

కర్నూలు మెగా సీడ్ ప్రాజెక్ట్‌పై సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పునఃసమీక్ష జరిపారు. ఇవాళ మధ్యాహ్నం జలవనరుల శాఖపై ఉన్నతాధికారులతో వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా కర్నూలు జిల్లా మెగా సీడ్ ప్రాజెక్ట్‌ పనులు ప్రస్తుతానికి నిలిపివేయాలని అధికారులను జగన్ ఆదేశించారు. ఈ ప్రాజెక్టు విషయమై మేలైన ఆలోచనలతో రావాలని అధికారులకు జగన్‌ సూచించారు. రూ.670 కోట్లతో ప్రపంచ స్థాయి మెగా సీడ్ పార్క్‌ను కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చెయ్యటానికి గతంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుకొచ్చింది. కర్నూల్ జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న మెగా సీడ్ పార్క్ కోసం అప్పట్లో ప్రభుత్వం 650 ఎకరాలు కేటాయించింది. ఈ పార్క్ కోసం అమెరికాకు చెందిన ఐయోవా యూనివర్శిటీతో ఎంఓయూ కుదుర్చుకుంది.

రూ.670 కోట్లతో వ్యయంతో కట్టే ఈ మెగా సీడ్ పార్క్ కోసం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా రూ.150 కోట్లు మంజూరు చేసింది. ఈ పార్కులో అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రపంచ స్థాయి ప్రయోగశాలలు, సీడ్ ప్రాసెసింగ్ సదుపాయాలు, విత్తన పరిశోధన, అభివృద్ధి కేంద్రంతో పాటు విత్తన ఎగుమతి అవసరమైన నాణ్యత ప్రమాణాలతో కూడిన అన్ని ఏర్పాట్లూ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. ముఖ్యంగా విత్తన పరిశోధన, నవ్య ఆవిష్కరణలు చేపట్టడం, వ్యాపార అభివృద్ధితో పాటు విత్తన వ్యాపారానికి ఇంక్యూబేటర్ గా ఉండడం, మానవ వనరుల అభివృద్ధి పర్చడం, ప్రపంచ విత్తన కార్యక్రమాలు చేపట్టడం, ప్రభుత్వ విత్తన విధి విధానాలకు చేయూతనివ్వడం, రైతులకు వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందివ్వడం వంటి కార్యక్రమాలకు మెగా సీడ్ పార్క్ వేదికగా నిలుస్తుందని చంద్రబాబు భావించారు. అయితే ఇప్పుడు జగన్ నిర్ణయంతో, ఈ మెగా సీడ్ పార్క్ ఆగిపోయింది.

Advertisements

Latest Articles

Most Read