మొన్నటి దాక మోడీ ప్రభుత్వం, చంద్రబాబు పై, ఆయన పార్టీ వ్యక్తుల పై , రాజ్యాంగ సంస్థలను అడ్డు పెట్టుకుని, చంద్రబాబుని ఊపిరి ఆడనివ్వకుండా చేసి, చివరకు ఆయన ఎన్నికలు ఓడిపోయే దాకా, టార్గెట్ పెట్టుకుని, స్పెషల్ ఆపరేషన్ లు చేసి, చంద్రబాబుని ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించటంలో, మోడీ, షా పాత్ర కూడా ఉందనేది అందరికీ తెలిసిందే. చంద్రబాబు మీద మోడీ/షా ఒక విషపు రాజాకీయ క్రీడ ఆడుతుంటే, అటు కేసీఆర్, ఇటు జగన్ ఎంజాయ్ చేసారు. కేసీఆర్ అయితే చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా, చంద్రబాబు అంతు చూస్తా అని చెప్పి, చంద్రబాబుని ఓడించటంలో ఆయన ఆడాల్సిన ఆట ఆడారు. అయితే, ఎప్పటికైనా పులి మీద స్వారీ చేస్తూ వెళ్తుంటే, ఆ పులి ఎదో ఒక రోజు మనల్నే మింగేస్తుంది అనే విషయం మాత్రం మరిచారు. చంద్రబాబుని సాధిస్తే చాలు, మనమే రెండు రాష్ట్రాలను ఏలొచ్చు అనుకుని, ప్రవర్తించారు. ఆ రోజు చంద్రబాబుకి కేసీఆర్ ఏ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారో కాని, ఈ రోజు మాత్రం మోడీ, కేసీఆర్ కు ఆయన మార్క్ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు.
ఆపరేషన్ తెలంగాణాలో భాగంగా, తెలంగాణాలో బీజేపీ జెండా పాతటానికి రంగం సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో, డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని బీజేపీ, మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో, ఏకంగా నాలుగు ఎంపీ సీట్లు గెలిచి, తెలంగాణా ఆపరేషన్ మొదలు పెట్టింది. ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల లోపు, తెలంగణాలో అధికారంలోకి రావటానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. అందులో భాగంగా, అటు రాజకీయంగా, ఇటు అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ రోజు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, టీఆర్ఎస్ పార్టీకి అతి పెద్ద ఫైనాన్షియార్ అయిన మై హోం అధినేత రామేశ్వరరావు ఇళ్లు, కార్యాలయాల పై ఈ రోజు ఐటీ దాడులు జరుగుతున్నాయి. నందగిరిహిల్స్‌లోని రామేశ్వరరావు ఇంట్లో కూడా ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. సోదాల్లో దాదాపు 100 మందికి పైగా ఐటి అధికారులు పాల్గొన్నారు. ఇటీవల టీవీ9, 10టీవీ, మోజో టీవీలను మై హోం అధినేత రామేశ్వరరావు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా, ఇప్పుడు బీజేపీ - టీఆర్ఎస్ మధ్య చాలా గ్యాప్ వచ్చిందని, ఈ పరిణామం చూస్తుంటే అర్ధమవుతుంది.