ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పార్టీల నుంచి తమ పార్టీల్లో నేతలను చేర్చుకుంటున్న బీజేపీ పార్టీ, ఇప్పుడు రాజకీయాల్లో రిటైర్డ్ అయ్యి ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా తమ పార్టీలో చేర్చుకునే పనిలో ఉన్నారు. ఇందులో భాగంగా వారి కన్ను మాజీ సియం నాదెండ్ల భాస్కరరావు పై పడింది. దీంతో వెంటనే ఆయనతో సంప్రదింపులు జరిపి, ఆయన్ను బీజేపీలో చేర్చుకునే ప్రయత్నం చేసారు. ఈ రోజు ఆయన కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీలో నెంబర్ టు అయిన అమిత్ షా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ రోజు హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా, శంషాబాద్‌లో జరిగిన సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో పాల్గున్నారు. ఇదే వేదిక పై, అమిత్ షా, నాదెండ్లకు కాషాయ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. నాదెండ్లతో పాటు పలువురు నాయకులు కూడా బీజేపీ పార్టీలో చేరారు. తనకు బీజేపీలో చేరమని, గత కొన్ని రోజులుగా ఆఫర్స్ వస్తున్నాయని, రెండు రోజుల క్రిందట నాదెండ్ల ఒక ఇంటర్వ్యూ లో చెప్పిన విషయం తెలిసిందే.
అయితే నాదెండ్ల భాస్కరరావు కుమారుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ మాత్రం జనసేన పార్టీలో నెంబర్ టు గా ఉన్న సంగతి తెలిసిందే. మరి తండ్రి ఒక పార్టీ, కొడుకు ఒక పార్టీలో ఉంటారా , లేక నాదెండ్ల మనోహర్ కూడా, త్వరలో బీజేపీలోకి చేరతారా అనేది తెలియాల్సి ఉంది. గతంలో ఎన్టీఆర్ అమెరికా వెళ్ళిన సమయంలో, ఆయన ప్రభుత్వాన్ని కూల్చి, నాదెండ్ల భాస్కరరావు సియం అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు మాత్రమే ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కరరావు పనిచేశారు. మళ్ళీ తిరిగి 1998లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం ఏపీ అయ్యారు. అప్పటి నుంచి ఆయన రాజకీయ సన్యాసంలో ఉన్నారు. ఇప్పుడు ఆయన వయసు దాదాపు 85 ఏళ్ళు ఉంటాయి. ఈ వయసులో పార్టీ ఎందుకు మారారు ? బీజేపీ పార్టీకి నాదెండ్ల భాస్కరరావు ఏ రకమైన సేవ చేయగలరు అనేది చూడాలి.