‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్..! మీరు ఏపీ ప్రజలను మోసగించారు. అంతేకాదు... అవిశ్వాస తీర్మాన సమయంలో నేను లేవనెత్తిన ప్రశ్నల్లో ఒక్కదానిక్కూడా బదులివ్వలేకపోయారు. మాకిచ్చిన హామీల గురించి చెబుతారేమోనని నిశ్శబ్దంగా వేచిచూసినా పట్టించుకోకుండా ముందస్తుగా తయారుచేసుకొచ్చిన ప్రసంగాన్ని చదివేసి ఆనాడు ఆంధ్రప్రదేశ్‌ను మరోసారి విస్మరించారు’ అని లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంతోపాటు, రాజ్యసభా ముఖంగా నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీల అమలులో ఇంతవరకూ ఏం చేశారన్నదానిపై కేంద్రం తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చలో ఆయన తెలుగుదేశం తరఫున మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల్లో మరోసారి మోసపోవడానికి దేశ ప్రజలెవ్వరూ సిద్ధంగా లేరని స్పష్టంచేశారు.
కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘అహంకారం.. విజ్ఞత కోల్పోయేలా చేస్తుంది. అంతిమంగా అది అభద్రతకు దారి తీస్తుంది. భాజపా మొత్తం ఆ దారిలోనే సాగుతున్నట్లు అనిపిస్తోంది. ప్రభుత్వం అయిదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలతోపాటు, దేశం మొత్తాన్ని మోసగిస్తూ వస్తోంది. ఒకసారి మోసం చేస్తే అది మీకు సిగ్గుచేటు. రెండోసారి మోసపోతే మాకు సిగ్గుచేటు అవుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను ఈ ప్రభుత్వం మోసం చేసింది. మరోసారి నేను మోసపోను. నా తోటి భారతీయులు కూడా మోసపోతారని అనుకోను. ఎన్డీయే అధికారంలోకి వస్తే దిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా ఇచ్చిన వాగ్దానం ప్రధానికి గుర్తులేదా? అయిదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని గుంటూరు, నెల్లూరు సభల్లో చెప్పిన మాట వాస్తవం కాదా?’ అని ప్రశ్నలు గుప్పించారు.
‘ఆంధ్రప్రదేశ్‌లో భాజపాకు ఓట్లేమీలేవు. అక్కడున్న 25 ఎంపీ స్థానాలు మొత్తం లోక్‌సభలో అయిదు శాతమే కదా అని మీరు అనుకొని ఉండొచ్చు. చంద్రబాబుని తక్కువ అంచనా వేసి ఉండొచ్చు. ఆయన తన 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఇలాంటి ఎన్నో ప్రభుత్వాలు వచ్చిపోవడాన్ని చూశారు. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే-1, ఎన్డీయే-2తో సహా ఎన్నో జాతీయ రాజకీయ కూటముల ఏర్పాటులో ఆయన కీలక భూమిక పోషించారు. రాజకీయాలకు అతీతంగా ఆయనకున్న విశ్వసనీయతను మీరు తక్కువ అంచనా వేశారు. దాని ఫలితంగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు మొదలై మొత్తం ప్రతిపక్షం ఏకమైంది. మీరు భారత ప్రజాస్వామ్య శక్తినీ తక్కువగా అంచనావేశారు' అని జయదేవ్ ఆరోపించారు.