తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు కూకట్‌పల్లిలో రోడ్‌షో నిర్వహించారు. ప్రజా కూటమి తరుపున ఆయన ఈ రోజు కూకట్‌పల్లిలో నిర్వహించిన రోడ్‌షోకు ప్రజలు పోటెత్తారు. ఈ ప్రజలను చూసిన కడుపు మంటో ఏమో కాని, చంద్రబాబు స్పీచ్ మొదలు పెట్టిన అయిదు నిమషాల తరువాత, అక్కడకు టీఆర్ఎస్ కూకట్‌పల్లి అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు సంబంధించిన ప్రచార వాహనం వచ్చింది. ఆ వాహనాన్ని చూసిన టీడీపీ కార్యకర్తలంతా దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చెయ్యగా, చంద్రబాబుకలుగ చేసుకుని, వద్దు తమ్ముళ్లూ..ఏం చెయ్యొద్దు వదిలేయండి అన్నారు. వాళ్ళే వెళ్ళిపోతారు వాళ్ళని ఏమి అనద్దు, వదిలెయ్యండి అని అన్నారు.
అంతేకాకుండా ఆయన(మాధవరం కృష్ణారావు) కూడా టీడీపీ నుంచి గెలిచి, టీడీపీకే ద్రోహం చేసి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన మనిషేనని, ఆయన గురించి కూడా మనం చెప్పుకుందాం అంటూ చంద్రబాబు అన్నారు. అయితే చంద్రబాబు మాటలకు అక్కడున్న కార్యకర్తలందరూ ఉత్తేజంగా కేరింతలు కొట్టారు. చంద్రబాబు ప్రసంగిస్తూ, ‘సైబరాబాద్ నా మానస పుత్రిక’ అని అన్నారు. సైబరాబాద్ నగరాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ప్రపంచ పటంలో పెట్టానని గుర్తుచేశారు. సైబరాబాద్ నిర్మాణంలో కేసీఆర్, కేటీఆర్ పాత్ర లేదని చెప్పారు. అలాగే టీడీపీ హయాంలోనే హైదరాబాద్‌లో ఉద్యోగాలు కల్పించామని వివరించారు. తానెందుకొచ్చానో ఈ సభలు చూస్తే టీఆర్‌ఎస్ నేతలకు అర్థమవుతుందన్నారు. కేసీఆర్ గుండెళ్లో రైళ్లు పరుగెత్తించాలని పిలుపు ఇచ్చారు.
మీ గుండెల్లో నాకున్న స్థానాన్ని ఎవరూ తొలగించలేరన్నారు. ఈ గడ్డపైనే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని తెలిపారు. మోదీ, అమిత్‌షా దేశాన్ని భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. మా హైదరాబాద్‌కు... మీ అహ్మదాబాద్‌కు పోలికా? అని అడిగారు. మోదీ, అమిత్‌షా దేశాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. పెద్దనోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని ధ్వజమెత్తారు. రెండు రాష్ట్రాలకు ప్రధాని మోదీ అన్యాయం చేశారని వివరించారు. అందుకోసమే దేశం కోసం టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌కు కోడికత్తి పార్టీ మద్దతిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. బెదిరింపులకు దిగుతున్నారని, బెదిరిస్తే భయపడేది లేదన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో 10 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. స్వార్థం కోసం పార్టీ మారారని మండిపడ్డారు. రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో టీడీపీ పౌరుషం చూపిద్దాం... మోసం చేసినవాళ్లకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నందమూరి ఆడబిడ్డను ఆఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు.