ప్రధాని నరేంద్రమోడీ సర్కారు చర్యల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు.. బీజేపియేతర పార్టీలని ఏకం చేసే పనిని మరింత వేగవంతం చేశారు. ఇటీవలే ఢిల్లీలో పర్యటించిన బాబు.. ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ సమావేశం అయ్యారు. ఇక ఇప్పుడు దక్షిణాదిపై ఫోకస్ చేశారు. చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం చెన్నై వెళ్లనున్నారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల నాటికి భాజపా వ్యతిరేక పార్టీలను ఏకం చేయడంలో భాగంగా ఆయన పలువురు నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. మోడీ విధానాలు, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం తదితర అంశాలపై డిఎంకే అధినేత స్టాలిన్‌తో చర్చలు జరపనున్నారు.
శుక్రవారం సాయంత్రం 5 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 6 గంటలకు చెన్నైకి చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అళ్వార్‌పేట్‌లోని చిత్తరంజన్ రోడ్డులో ఉన్న డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ నివాసానికి చేరుకుంటారు. స్టాలిన్, ఇతర డీఎంకే నేతలు చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలకనున్నారు. అనంతరం సుమారు గంటపాటు స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా బయలు దేరి చెన్నై విమానాశ్రయం చేరుకుంటారు. 8.50కి ప్రత్యేక విమానంలో బయలుదేరి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. ఈ సమావేశంలో ఇరు పార్టీల సీనియర్ నేతలు పలువురు పాల్గొననున్నారు.
మోడీ విధానాలు దేశానికి ప్రమాదకరమని ఢిల్లీ వేదికగా చెప్పిన చంద్రబాబు.. జాతీయ స్థాయిలో ఫ్రంట్ రూపకల్పన ప్రయత్నాలను చేస్తున్నారు. రాష్ట్రాలపై ప్రధాని మోడీ కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారన్న చంద్రబాబు.. బీజేపీయేతర పార్టీలన్నీ ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు. కూటమి ఏర్పాటుకు ప్రాథమికంగా చర్చలు జరుగుతున్నాయని బెంగళూరులో దేవేగౌడ, కుమారస్వామి భేటీ అనంతరం. తెలిపారు. అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. విభజన హామీలు అమలు చేయకపోగా.. ఐటీ, సీబీఐ దాడులతో పేరుతో.. అందరిని భయపెడుతున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఉత్తరాధిలో బీజేపీయేతర పార్టీలతో ఇప్పటికే కలిసి చర్చలు జరిపిన చంద్రబాబు.. ఇప్పుడు దక్షిణాదిలోనూమ, చక్రం తిప్పుతున్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు చర్చలు జరిపిన అన్ని పార్టీలు ఆయనకు మద్దతు ఇచ్చాయి.