సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డ్స్ అమరావతి 2018 కార్యక్రమం సందడి శుక్రవారం నుంచి విజయవాడలో ఆరంభం కాబోతోంది. కరీనాకపూర్, సమంత, దేవిశ్రీప్రసాద్, వి.వి.ఎస్.లక్ష్మణ్, కుష్బు, స్వరాభాస్కర్, ప్రణీత సహా అనేక మంది ప్రముఖులు విజయవాడకు తరలిరానున్నారు. యూట్యూబ్‌లో వివిధ రంగాలకు సంబంధించి ఈ ఏడాది ఉత్తమ ప్రతిభచూపిన వారికి అవార్డులను అందజేయనున్నారు. సెలబ్రిటీ విభాగంలోనూ అవార్డులను అందజేస్తారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నగరంలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్‌లో సోషల్ మీడియా సమ్మిట్ ఉంటుంది.
దీనిలో భాగంగా.. ఆయా రంగాల్లోని ప్రముఖులు మాట్లాడతారు. మాజీ క్రికెటర్ వి.వి.ఎస్.లక్ష్మణ్ క్రీడల్లో సోషల్ మీడియా పాత్రపై వివరిస్తారు. సామాజికంగా ఎలాంటి ప్రభావం చూపుతుందనే విషయంపై ప్రముఖ బాలీవుడ్ నటి.. స్వరాభాస్కర్ ప్రసంగిస్తారు. పర్యాటక రంగంపై సామాజిక మాధ్యమాల ప్రభావం ఎలా ఉందనేది ఏపీ టూరిజం అథారిటీ సీఈవో హిమాన్షుశుక్లా వివరిస్తారు. ఎన్నికలు, రాజకీయాలపై సోషల్ మీడియా పాత్రపై ప్రముఖ నటి కుష్భు మాట్లాడతారు. భవిష్యత్తులో సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి మార్పు భారతదేశంలో రాబోతోందనే విషయంపైనా పలువురు వక్తలు మాట్లాడతారు. తొలి రోజు 15మంది ప్రముఖులు పాల్గొని సోషల్ మీడియా ప్రభావంపై ప్రసంగిస్తారు.
సోషల్ మీడియా సమ్మిట్‌లో రెండో రోజు సాయంత్రం 6గంటల నుంచి కార్యక్రమం ఆరంభమవుతుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడామైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవ్వనున్నారు. సోషల్ మీడియాలో రాణిస్తున్న 40 మందికి అవార్డులను ముఖ్యమంత్రి చేతులమీదుగా అందజేయనున్నారు. బాలీవుడ్ నటి కరీనాకపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. కరీనాకపూర్‌తో పాటూ సమంత అక్కినేని, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌లకు సెలబ్రిటీ విభాగంలో అవార్డులను ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేయనున్నారు. గతేడాది జరిగిన సోషల్ మీడియా సమ్మిట్‌లో దీపిక పదుకొణె, దగ్గుబాటి రానా, సంగీత దర్శకుడు అనిరుధ్‌కు అవార్డులను అందజేశారు.