ఈ ఏడాది జులై నెలాఖరు నాటికి పంచాయతీల ఎన్నికలు పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు సోమవారం ఆదేశాలు జారీ అయ్యాయి. 2013 జులైలో మూడు దఫాలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. నూతన పాలకవర్గాలు ఆగస్టు 2న ప్రయాణస్వీకారం చేశాయి. వారి పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టు 1తో ముగియనుంది. ఈ లోగానే ఎన్నికలు నిర్వహించి కొత్త పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని కమిషన్ భావిస్తోంది. అయితే ప్రభుత్వం దీనిపై తీసుకునే నిర్ణయమే అంతిమం.
ఈ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనేది ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది. కొద్దికాలం కిందట ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని యంత్రాంగాన్ని రాష్ట్ర ఈసీ ఆదేశించింది. ఈ క్రమంలో తాజా ఉత్తర్వులను వెలువరించింది. మే 15న గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా చిత్రాలతో ఉన్న ఓటర్ల జాబితాను ప్రదర్శించాలి. జూన్ 15న పోలింగ్‌బూత్‌ల వివరాలను ప్రదర్శించాలి. 25 నాటికి గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల రిజర్వేషన్లను నిర్దేశించాలి. ఎన్నికల విధుల్లో ఉండాల్సిన ఉద్యోగుల పూర్తి, వ్యక్తిగత వివరాలను కంప్యూటరీకరణ చేయాలి. రెవెన్యూ డివిజన్‌ల వారీగా మూడుదశల్లో జరగాల్సిన ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేయాలి. జూన్ 25 నాటికి సర్పంచి, వార్డుసభ్యుల ఓటింగ్‌కు అవసరమైన తెల్ల, గులాబి రంగు బ్యాలెట్ పేపర్లను, చెరగని ఇంకును సిద్ధం చేసుకోవాలి. జూన్ 30 నాటికి ఆయా పోలింగ్‌బూత్‌ల వారీగా బందోబస్తు, శాంతి భద్రతల ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. తదుపరి జులై 31వ తేదీ నాటికి ఎన్నికలు పూర్తి చేసేలా ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నాప్పటికీ గ్రామాల్లో రాజకీయాల ఆధారంగానే అభ్యర్థులు పోటి చేయడం రివాజుగా వుంది. గ్రామాల్లో ఖర్చు చేసే విధులు, అమలయ్యే పథకాలు ఎంపికలో సర్పంచులే కీలకపాత్ర వహిస్తుండడంతో ప్రతి రాజకీయ పార్టీ మెజార్టీ సర్పంచులను కైవసం చేసుకునేందుకు ఎత్తుగడలు వేయడం సహజం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పాలక మండళ్లుంటునే గ్రాంటులను విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఆదేశాలను జారీ చేసింది.