బిజినెస్ రిఫార్మ్ యాక్షన్‌ప్లాన్ ఇంప్లిమెంటేషన్‌లో వందశాతం స్కోరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ర్యాంకు లభించింది. ఇది చెప్పింది చంద్రబాబు కాదు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ లోని పత్రికలు కావు... నీతి ఆయోగ్ ... ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయానా చైర్మన్‌గా ఉన్న నీతి ఆయోగ్, ఈ విషయం చెప్పింది. నీతిఆయోగ్ సూచికల్లో ఏపీ పలు ర్యాంకులను నమోదుచేసుకుంది. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అగ్రికల్చరల్ మార్కెటింగ్-ఫార్మర్ ఫ్రెండ్లీ రిఫార్మ్ ఇండెక్స్-2016లో 56.2 స్కోరుతో ఏపీకి 7వ ర్యాంకు లభించింది. అలాగే పెర్ఫామెన్స్ ఆన్ హెల్త్ అవుట్ కమ్ ఇండెక్స్-2016లో ఏపీకి 10వ ర్యాంకు, హెల్త్ ఇండెక్స్ 2018లో 60.16 స్కోరుతో 8వ ర్యాంకు లభించింది. ఇక స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్-2016లో 56 శాతం స్కోరుతో 17వ ర్యాంకు దక్కింది.
అంతేగాక గ్రామీణ మౌలిక సదుపాయాల్లో సాధించిన ప్రగతి ఈ విధంగా ఉంది. అర్హత గల అన్ని కుటుంబాలకు నూరుశాతం ఎల్‌పీజీ కనెక్షన్ల అందజేత, రాష్ట్రంలో ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం, గ్రామీణ ప్రాంతాలలో నూరుశాతం ఓడీఎఫ్ అమలు, 80 శాతం శివారు గ్రామాలన్నీ రహదారులకు అనుసంధానం, 30,500 కి.మీ మేర గ్రామాలలో అంతర్గత సిమెంట్‌రోడ్ల నిర్మాణం జరిగినట్లు గుర్తించారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ వివరాలు వెల్లడించారు.. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు ఎప్పటికప్పుడు కాలానుగుణంగా విజన్‌ను మార్పు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను కోరారు. ఇప్పటి వరకూ ఎంతో బాగా పనిచేసినా, సూక్ష్మస్థాయిలో పనితీరు ఇంకా మెరుగుపరచుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చెప్పారు.
‘విభజనలో మనకు అన్యాయం జరిగింది. ఎక్కడో ఉండాల్సిన వాళ్లం కింది వరుసకు వచ్చాం. విభజనతో సమస్యల్లో ఉన్నామనుకుంటే కేంద్రం సహకరించటం లేదు. జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆనాడు ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకున్నాం. మనకిచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టే కేంద్రంతో విభేదించాం. మనం గట్టిగా అడగకపోతే ఇంకా నష్టపోతామనే ప్రశ్నిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. జనాభా నియంత్రణకు నాడు తన హయాంలో తీసుకున్న చర్యలతో మంచి ఫలితాలు సాధించామని, జనాభా నియంత్రణలో కేరళతో పోటీ పడ్డామని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం జనాభా నియంత్రణ నుంచి జనాభా లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే ఇంకా నష్టపోతామని అన్నారు. 14వ ఆర్థిక సంఘం కూడా 1971 జనాభా ప్రాతిపదికగా తీసుకుందని చెప్పారు. 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే, పార్లమెంటు సీట్లు కూడా దక్షిణ భారతదేశంలో తగ్గిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ఇది ప్రగతి శీల రాష్ట్రాలకు అన్యాయం చేసినట్టే అవుతుందన్నారు. అటు విభజన వల్ల ఇటు 15వ ఆర్ధిక సంఘం విధి విధానాల వల్ల మనం తీవ్రంగా నష్టపోతామని తెలిపారు.