అమరావతి రాజధానిని ముక్కలు చేస్తూ, పరిపాలన వికేంద్రీకరణ, అలాగే సిఆర్డీఏ రద్దు బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. తమకు బలం ఉంది కాబట్టి, ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అనే కొత్త వింత కాన్సెప్ట్ ను అసెంబ్లీలో ఆమోదించారు. అయితే రైతుల ఆందోళన పట్టించుకోకుండా చేసిన, ఈ బిల్లుల పై, శాసనమండలి బ్రేక్ వేసింది. సెలెక్ట్ కమిటీకి ఈ బిల్లు పంపించి, ప్రజాభిప్రాయం తీసుకుని, ముందుకు వెళ్ళాలని, శాసనమండలి నిర్ణయం తీసుకుంది. అయితే, సెలెక్ట్ కమిటీ వెయ్యకుండా, శాసనమండలి సెక్రటరీ పై ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీని పై ఇప్పటికే హైకోర్టు లో కూడా కేసు ఉంది. మండలి చైర్మెన్ చెప్పినా, సెలెక్ట్ కమిటీ వెయ్యలేదని, పిటీషన్ దాఖలు అయ్యింది. అయితే, ఒక పక్క మండలి సెలెక్ట్ కమిటీకి పంపిస్తే, మళ్ళీ ఈ రెండు బిల్లులు అసెంబ్లీలో ప్రవేశపెట్టి, రెండో సారి శాసనమండలికి పంపారు. దీంతో రెండో సారి కూడా, ఈ బిల్లులను మండలి పరిగణలోకి తీసుకోలేదు. ఈ వ్యవహారం, ఇప్పటికే సెలెక్ట్ కమిటీ దగ్గర ఉందని, అలాగే హైకోర్టు పరిధిలో ఉందని, ఇలాంటి బిల్లులు పై చర్చించం అని మండలి నిర్ణయం తీసుకుంది.
అయితే 14 రోజులు దాటటంతో, ప్రభుత్వం ఈ రెండు బిల్లులు ఆమోదించాలి అంటూ, గవర్నర్ వద్దకు పంపించింది. దీంతో ఇప్పుడు గవర్నర్ ఏమి చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాలుగు రోజులు అయిన, గవర్నర్ ఏ నిర్ణయం తీసుకోక పోవటంతో, గవర్నర్ వద్దకు ప్రత్యేక దూతగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా ప్రభుత్వం పంపించి, బిల్లులు ఆమోదించాలని కోరింది. అయితే ఇదే అంశం పై, తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టుల పిటీషన్ వేసారు. మండలిలో సెలెక్ట్ కమిటీలో ఉన్న అంశం పరిగణలోకి తీసుకోకుండా, గవర్నర్ వద్దకు బిల్లులు పంపించారని, అడ్డుకోవాలని కోరారు. అయితే ఈ కేసులో కౌంటర్ దాఖలు చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతూ, హైకోర్టు ఆగష్టు 6కి వాయిదా వేసింది. ఈ సందర్భంగా, దీపక్ రెడ్డి తరుపు న్యాయవాది స్పందిస్తూ, ఈ లోపు గవర్నర్ ఈ బిల్లులు ఆమోదించే అవకాసం ఉందని, కోర్టు దృష్టికి తీసుకు రాగా, దీని పై స్పందించిన కోర్టు, ఏ నిర్ణయం ఎవరు తీసుకున్నా చట్ట ప్రకారం చెయ్యాలని, ఏదైనా న్యాయసమీక్షకు కట్టుబడే ఉంటుందని, ఏదైనా అనుకోని పరిస్థితి వస్తే, ఆందోళన అవసరం లేదని, తాము చూసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది.