పది రోజుల క్రితం , మంత్రి బాలినేని స్టిక్కర్ ఉన్న వాహనంలో, వైసీపీకి చెందిన ఒంగోలు నాయకుడు ఒకరు, దొంగ చాటుగా, రూ.5.27 కోట్లు ఒంగోలు నుంచి చెన్నై తరలిస్తూ, తమిళనాడు చెక్ పోస్ట్ దగ్గర, తమిళనాడు పోలీసులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై అనేక అనుమానాలు తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేసింది. ఇది ఆంధ్రప్రదేశ్ లో అవినీతి సొమ్ముగా చెప్తూ, చెన్నై నుంచి హవాలా మార్గంలో, తరలిస్తున్నారు అనేది, తెలుగుదేశం పార్టీ ఆరోపణ. ఇదే విషయం పై తేల్చాలి అంటూ, తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఒక లేఖ రాసారు. పట్టుబడిన వాహనం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బంధువు, మంత్రి అయిన బాలినేని శ్రీనివాసరెడ్డిదిగా అనుమానం వ్యక్తం చేసారు. ఈడీకి ఉత్తరం రాస్తూ ఈ విషయం పై, మనీ లాండరింగ్, PMLA కింద విచారణ జరపాలని విజ్ఞప్తి చేసారు. దీంతో ఈ విషయం పై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు, ఈడీ రంగంలోకి దిగింది. ఇదే విషయం పై విచారణ మొదలు పెట్టింది.
మరో పక్క నారా లోకేష్ మాట్లాడుతూ, దొరికిన రూ.5.27 కోట్లు, జగన్ మోహన్ రెడ్డి, మారిషస్ కు తరలించిన రూ.1200 కోట్లలో కొంత భాగం అని సంచలన ఆరోపణలు చేసారు. అంతే కాదు, ఈ మొత్తం హవాలా వ్యవహారం చెన్నై వేదికగా జరుగుతుంది అంటూ, కొన్ని కంపెనీల పేర్లు కూడా బయట పెట్టారు. అలాగే, మరో విషయం చెప్తూ, జగన్ మోహన్ రెడ్డి చెన్నై లో, రూ.122 కోట్లతో మరో పెద్ద ప్యాలెస్ కడుతున్నారని ఆరోపించారు. ఇక ఈ వ్యవహారం పై స్పందించిన బాలినేని మాత్రం, తనకు ఆ దొరికిన డబ్బుకు సంబంధం లేదని అన్నారు. దొరికిన వారు తమ పార్టీ వారేనని, వారు వ్యాపారం నిమిత్తం ఆ డబ్బు తీసుకు వెళ్తున్నారని అన్నారు. అయితే రూ.5 కోట్లు క్యాష్ తో, ఎలాంటి లావాదేవీలు జరపకూడదు అనే విషయం, అందరికీ తెలిసిందే. అనేక అనుమానాలు ఉన్న ఈ విషయం పై, ఈడీ రంగంలోకి దిగటంతో, ఈ విషయం ఒక కొలిక్కి వస్తుందేమో చూడాలి.