ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం, ఈ రోజు జరగనుంది. సచివాలయం దగ్గర ఉన్న పార్కింగ్ ప్లేస్ లో ఈ కార్యక్రమం జరగనుంది. ఇది ఇలా ఉంటే, మంత్రి పదవి దక్కని వారు, ఎప్పుడూ లేని విధంగా జగన్ పై భగ్గుమన్నారు. ముఖ్యంగా జగన్ బంధువు అయిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. విజయమ్మ వైపు నుంచి బాలినేనితో జగన్ కు చుట్టరికం ఉంది. బాలినేనిని తప్పించటం పైన, కుటుంబంలో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి, తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రెడ్డి సమాజికవర్గం నుంచి నలుగురికి స్థానం కల్పించి, తనకు ఇవ్వకపోవటం పై బాలినేని సీరియస్ అయ్యారు. నిన్న మధ్యానం సజ్జల రామకృష్ణా రెడ్డి, బాలినేని ఇంటికి వెళ్లి, ఆయాన్ను బుజ్జగించే ప్రయత్నం చేసారు. ప్రకాశం జిల్లా నుంచి ఎవరూ మంత్రులు లేరని, ఆదిమూలపు సురేష్ ని కూడా తొలగిస్తున్నాం అని చెప్పారు. అయితే సాయంత్రానికి చివరి నిమిషంలో, మళ్ళీ ఆదిమూలపు సురేష్ పేరు లిస్టు లోకి రావటంతో, బాలినేని ఫైర్ అయ్యారు. తనను మోసం చేసారని బాలినేని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. పార్టీ కోసం ముందు నుంచి కష్టపడిన తనను పక్కన పెట్టారు అంటూ, బాలినేని తీవ్ర భావోద్వేగానికి గురి కావటంతో, బాలినేనికి హై బీపీ రావటంతో, డాక్టర్లు వచ్చారు.
అయితే గత రాత్రి మళ్ళీ సజ్జల రామకృష్ణా రెడ్డి బాలినేని ఇంటికి వెళ్లారు. శ్రీకాంత్ రెడ్డి, కరణం బలారం తో కలిసి, సజ్జల బాలినేని ఇంటికి వచ్చారు. ఎంత బుజ్జగించినా బాలినేని మాత్రం మెత్తబడలేదు. దీంతో చేసేది ఏమి లేక సజ్జల వెనుదిరిగారు. అయితే సజ్జల బయటకు వెళ్ళే సమయంలో, బాలినేని అనుచరులు సజ్జల పై విరుచుకు పడ్డారు. అయితే బాలినేని మాత్రం, ఈ రోజు రాజీనామా చేస్తారు అంటూ వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ వెళ్లి, షర్మిలతో కూడా బాలినేని భేటీ అవుతారు అంటూ వార్తలు వస్తున్నాయి. కేవలం కుటుంబ కలహాల వల్లే, బాలినేనిని జగన్ దూరం పెట్టారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పటికే విజయమ్మ తాను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని చెప్పటం, అలాగే షర్మిల దూరం అవ్వటం, ఈ పరిణామాల నేపధ్యంలో, విజయమ్మ వైపు చుట్టరికం ఉన్న బాలినేనిని కూడా దూరం పెట్టారు అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే బాలినేని ఈ రోజు హైదరాబాద్ వెళ్లి, షర్మిలను కలిసిన తరువాత, మీడియాతో మాట్లడతారనే వార్తలు వస్తున్నాయి.