రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన కుటుంబంతో కలిసి సంక్రాంతి వేడుకులు సొంత ఊరిలో జరుపుకుంటున్న విషయం తెలిసిందే... ఈ సందర్భంగా ఆయన ఆదివారం చంద్రగిరిలోగల హెరిటేజ్ ఫ్యాక్టరీని సందర్శించారు. దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాల తర్వాత ఆయన ఈ ఫ్యాక్టరీని సందర్శించడం గమనార్హం. 40 మంది ఉద్యోగులు, 50 మంది కార్మికులతో... 1.5లక్షల లీటర్ల పాలతో హెరిటేజ్ సంస్థ, ఇప్పుడు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి సారధ్యంలో మహా వృక్షం అయ్యింది... ఎప్పుడో 21 ఏళ్ళ క్రితం ఇక్కడకు వచ్చిన చంద్రబాబు, ఇన్నాళ్ళకు మళ్ళీ అక్కడకు వెళ్లారు...
ఈ సందర్భంగా చంద్రబాబునాయడు మాట్లాడుతూ, తన సతీమణి భువనేశ్వరి వల్లే ‘హెరిటేజ్’ ఈరోజు ఈ స్థాయికి చేరిందని ప్రశంసించారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు నడవాలని, సామాజిక బాధ్యతతో కష్టపడి పని చేస్తే అవార్డులు వస్తాయని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. అంతకుముందు, ఇంధన పొదుపులో జాతీయ అవార్డుల సాధనకు కృషి చేసిన ‘హెరిటేజ్’ ఉద్యోగులను చంద్రబాబు అభినందించారు. అలాగే హెరిటేజ్ కంపెనీని వైస్ ఛైర్మన్, ఎండీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక విజన్‌తో 25 ఏళ్ల క్రితం హెరిటేజ్ కంపెనీని ప్రారంభించారని చెప్పారు. ప్రారంభంలో ఎన్నో ఒడుదుడుకులు ఎదుర్కోవలసి వచ్చిందని అన్నారు. కష్ట సమయాల్లో కంపెనీకి అండగా ఉన్న హెరిటేజ్ కుటుంబసభ్యులందరికీ ఆమె అభినందనలు తెలిపారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరిలోని గోకుల్ ఫ్లాంట్కి జాతీయ స్థాయిలో ఎనర్జీ కంజర్వేషన్ అవార్డులు రావడం ఆనందంగా ఉందని భువనేశ్వరి అన్నారు. హెరిటేజ్‌లో మహిళలకు ఉపాధి అవకాశాలు ఎక్కువని ఆమె చెప్పారు. కష్టపడి సిన్సియర్‌గా పనిచేస్తే కంపెనీలకు అవార్డులు రావడం కష్టంకాదని భువనేశ్వరి అన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, హిందూ పురం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ తమ కుటుంబాలతో కలిసి నిన్న నారావారిపల్లికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.