నిన్న శ్రీకాకుళంలో జిల్లా, సోంపేట మండలం పలాసలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అశోక్ పై, వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన విషయం మర్చిపోక ముందే, ఈ రోజు మరో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పై దాడికి ప్రయత్నం చేసారు వైసీపీ కార్యకర్తలు. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి పై వైసీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నించటం సంచలనంగా మారింది. అది కూడా ఒక ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో. స్థానికంగా ఉన్న ఓ కల్యాణమండపంలో నిర్వహిస్తున్న రైతుభరోసా కార్యక్రమానికి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి హాజరయ్యారు. అయితే ఆయన్ను అక్కడకు రాకుండా వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వెనక్కి వెళ్లాలంటూ హడావిడి చేసారు, ఈ సందర్భంగా తోపులాట జరిగింది. ఇంత హడావిడి జరగటంతో, ఎమ్మెల్యే కల్యాణమండపం బయటే ఉండిపోయారు. ఇంత జరుగుతున్నా, పోలీసులు కూడా వారిని వారించలేక పోయారు.
ఈ సందర్భంగా, ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి మీడియాతో మాట్లాడుతూ, తన ఆవేదన చెప్పుకున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం అని, ఈ కార్యక్రమానికి వెళ్తునట్టు తాను ముందే, పోలీసులకు ముందుగానే సమాచారం ఇచ్చానని తెలిపారు. అయినా తనకు పోలీసులు సరైన రక్షణ కల్పించలేదని ఆవేదనచెందారు. ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గునలేక పొతే, ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకుని ప్రశ్నించారు, ఓ ఎమ్మెల్యేకే రక్షణ ఇవ్వలేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటని పోలీసులని ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమానికి హాజరవుతున్న తనను అడ్డుకుంటే, ఇంకా ఎవరికీ చెప్పుకోవాలని అన్నారు. ఒక పక్క కార్యకర్తలను చంపేస్తూ, మరో పక్క ఎమ్మెల్యేల పై దాడులు చేస్తుంటే, హోం మంత్రి మాత్రం ఏమి స్పందించటం లేదని అన్నారు.