నేరాల అదుపులో సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు సాగుతున్న ఏపీ పోలీసు శాఖకు కేంద్ర హోంశాఖ ఏకంగా 7.69 కోట్ల రూపాయల రివార్డు ప్రకటించింది. ఈ మొత్తంతో అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు రాష్ట్ర పోలీసు శాఖ ప్రణాళిక రచిస్తోంది. నేర నియంత్రణలో అభివృద్ధి చెందిన దేశాలను తలపించేలా టెక్నాలజీని వినియోగిస్తూ మన పోలీసు శాఖ ముందడుగు వేస్తోంది. ఇంటికి తాళం వేసి కుటుంబం ఊరెళితే ఆ ఇంట్లో ఆస్తిని కాపాడటం నుంచి బయటికెళ్లిన మహిళల్ని లైంగికంగా వేధిస్తే బాధ్యులను జైలుకు పంపడం వరకూ టెక్నాలజీని వినియోగిస్తూ రాష్ట్ర పోలీసు శాఖ ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలుస్తోంది.
సైబర్ దొంగలకు ఫైర్వాల్తో అడ్డుకట్ట వేస్తున్నారు. ఆన్లైన్లో బెట్టింగ్లకు పాల్పడే ముఠాలకు సంకెళ్లు వేసి వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఇవేగాక ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు, సీసీటీఎన్ఎ్సలో వంద శాతం పురోగతి, కేసు నమోదు చేయగానే బాధితుల మొబైల్ నెంబర్కు సమాచారం లాంటి సేవలు అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 15వేలకు పైగా సీసీ కెమెరాలను అనుసంధానించి మొత్తం ఏపీని మంగళగిరిలోని టెక్టవర్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. శాంతిభద్రతల విధుల్లో ఉన్న పోలీసులకు బాడీవార్న్ కెమెరాలు, గుంపులో ఉండి అల్లర్లకు పాల్పడేవారిని కనిపెట్టేందుకు డ్రోన్లు, ఇతర రాష్ట్రాల దొంగలు ఏపీలోకి ప్రవేశిస్తే పసిగట్టేందుకు వేలిముద్ర ల టాబ్లు పోలీసులు అందిపుచ్చుకున్నారు. గ్రామా ల్లో ఇంటి భద్రత నుంచి ప్రవాసాంధ్రులకు అండగా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రజలకు సేవలందిస్తోన్న ఏపీ పోలీసు శాఖ పనితీరును ఏడాది కాలంగా కేంద్ర హోంశాఖ పర్యవేక్షించింది.
ఏపీ పోలీసు శాఖ సిబ్బంది నియామకం, సంక్షేమానికి కూడా పెద్దపీట వేసింది. గడిచిన మూడేళ్లలో సుమారు 9 వేల పోలీసు సిబ్బంది నియామకం, పదోన్నతులు, మహిళా పోలీసులకు ప్రత్యేక వసతుల కల్పన, ఆరోగ్య పరీక్షలు తదితర సంక్షేమ కార్యక్రమాలపై డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. దేశంలోని 29 రాష్ట్రాల పోలీసులు అమలు చేస్తున్న విధానాలను ఏడాదిపాటు క్షుణ్నంగా పరిశీలించిన కేంద్ర హోంశాఖ పది రాష్ట్రాలకు భారీ రివార్డులు ప్రకటించింది. ఒక్కో రాష్ట్రానికి 7.69 కోట్ల రూపాయలు ఇస్తోంది. ఆ డబ్బుతో మరిన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసుకుని ప్రజలకు మెరుగైన సేవలందించాలని సూచించింది.