పాడేరులో వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచార సభ రసాభాసగా మారింది. పాడేరు వైసీపీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. జగన్ సమక్షంలోనే పాడేరు వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మికి వ్యతిరేకంగా ఆ పార్టీ పాడేరు సమన్వయకర్త మత్యరాస విశ్వేశ్వరరాజు అభిమానులు నినాదాలు చేశారు. జగన్ సభలో ప్రసంగిస్తున్న సమయంలోనే వైసీపీ జెండాలు, ప్లెక్సీలను విశ్వేశ్వరరాజు వర్గీయులు తగులబెట్టారు. అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను చదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వైసీపీకి సీనియర్ నేత మత్యరాస బాలరాజును పోలీసులు కొట్టారు. ఈ నేపథ్యంలోనే వైసీపీలో ఉన్న వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.
ఆదివారం విడుదల చేసిన వైసీపీ అభ్యర్థుల జాబితాలో మాజీ సమన్వయకర్త కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి పేరు కనిపించడంతో విశ్వేశ్వరరాజు ఖిన్నులయ్యారు. ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నర్సీపట్నంలో నిర్వహించిన రోడ్‌షోలో వైసీపీ అధినేత జగన్ ప్రసంగిస్తుండగా విశ్వేశ్వరరాజు మద్దతుదారులు ‘భాగ్యలక్ష్మి వద్దు... విశ్వేశ్వరరాజు ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ ఫ్లెక్సీలను ప్రదర్శించారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందిన గిడ్డి ఈశ్వరి.... అనంతరం ఏర్పడిన రాజకీయ పరిణామాలతో టీడీపీలో చేరారు. ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా ఆమె బాటలో నడిచారు. దీంతో వైసీపీకి పెద్దదిక్కులేని పరిస్థితి ఏర్పడింది.
మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి చిట్టినాయుడు కుమార్తె భాగ్యలక్ష్మిని సమన్వయకర్తగా అధిష్ఠానంనియమించింది.. అయితే ఆమె అందర్నీ కలుపుకుని వెళ్లడంలేదని, ఆశించిన స్థాయిలో పార్టీని బలోపేతం చేయలేకపోతున్నదని భావిస్తూ కొద్ది రోజులకే సమన్వయకర్త పదవి నుంచి తప్పించారు. ఆమె స్థానంలో జి.మాడుగులకు చెందిన న్యాయవాది మత్స్యరాస విశ్వేశ్వరరాజును నియమించారు. ఏడాది నుంచి నియోజకవర్గంలో పార్టీ పటిష్టతకు కృషి చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పాడేరు టిక్కెట్ తనకేనని అధిష్ఠానం హామీ ఇచ్చినట్టు చెప్పేవారు. అయితే విశ్వేశ్వరరాజుతోపాటు మాజీ ఎమ్మెల్యే దేముడు కుమార్తె మాధవి, మాజీ సమన్వయకర్త భాగ్యలక్ష్మి కూడా పాడేరు టిక్కెట్‌నే ఆశించారు. వాల్మీకి తెగకు చెందిన చెట్టి ఫాల్గుణకు అరకులోయ ఎమ్మెల్యే టిక్కెట్, భగత తెగకు చెందిన తనకు పాడేరు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తారని విశ్వేశ్వరరాజు భావించారు.