ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బహిరంగ లేఖ రాశారు. 2014 ఎన్నికల సందర్భంగా ఏపీకి ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ బాబు లేఖ రాయడం జరిగింది. గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు, మీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఐదు కోట్ల రాష్ట్ర ప్రజానీకం తీవ్రంగా నిరసిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హేతుబద్ధత లేకుండా విభజించడంలో భారతీయ జనతా పార్టీ ప్రముఖ పాత్ర వహించిన సంగతి మీకు గుర్తుండే ఉంటుందని బాబు చెప్పుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో మీరు ‘తల్లిని చంపి బిడ్డను బయటకు తీసిన’ కాంగ్రెస్ పార్టీ తీరును విమర్శిస్తూ, తల్లీని, బిడ్డనూ కాపాడుతానని, సీమాంధ్ర ప్రాంతాన్ని అన్ని విధాలుగా, అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని ఎన్నికల ముందు తిరుపతి, నెల్లూరు, భీమవరం, మదనపల్లి, గుంటూరు సభలలో చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి" అని ఘాటుగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
చంద్రబాబు లేఖలోని ముఖ్యాంశాలు.. :-" అమరావతి రాజధాని శంకుస్థాపన సందర్భంలో ఢిల్లీ కూడా చిన్నబోయే రాజధానిని నిర్మించేందుకు సహకరిస్తానని మీరిచ్చిన మాట మీకు గుర్తుందా.? అంతేకాకుండా విభజన చట్టంలోని అన్ని అంశాలను తు.చ. తప్పకుండా అమలుచేస్తానని చెప్పారు. అన్నివిధాలుగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేస్తానని చెప్పి ‘నీరు-మట్టి’ ఇచ్చి వెళ్లారు. :- దురదృష్టవశత్తూ, మీరు ప్రధానమంత్రి అయిన వెంటనే అంతకు ముందు చేసిన వాగ్దానాలన్నీ ‘గజనీ’లాగా మరచిపోవడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపరచిన పలు అంశాల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడం మా రాష్ట్ర ప్రజల గుండెలను గాయపరచింది. అంతేకాకుండా, ఆనాడు రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ ప్రకటించిన రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా, మరియు ఇతర హామీలను తుంగలో తొక్కి రాష్ట్రానికి మీరు చేసిన తీవ్ర అన్యాయం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆందోళనకు, కలతకు గురిచేసింది. :- విభజన చట్టంలోని అంశాలను, అప్పటి ప్రధాని రాజ్యసభలో ఇచ్చిన హామీలను అమలుపరచే దిశగా కేంద్ర ప్రభుత్వాన్ని నడిపే మీ వద్దకు, మీ మంత్రుల వద్దకు 29 పర్యాయాలు నేను వచ్చి విజ్ఞప్తులు ఇచ్చిన విషయం మీకు అసలు గుర్తున్నదా.? హామీల అమలు చేయాలని కోరుతూ నేనూ, నా మంత్రిమండలి సహచరులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పలుమార్లు తిరిగినప్పటికీ మాకు చట్టపరంగా, హక్కుగా రావాల్సిన అనేక ప్రయోజనాలను కక్షపూరితంగా రాకుండా చేయడం శోచనీయం. :- ముఖ్యంగా ప్రత్యేక హోదా ప్రకటించాలని అనేకసార్లు కోరినప్పటికీ 14 వ ఆర్థిక సంఘం సిఫారసులు అడ్డు వస్తున్నాయని నమ్మబలికి దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు. :- ప్రత్యేక హోదాకు ఆర్థిక సంఘం సిఫారసులు అడ్డురావని 14 వ ఆర్థిక సంఘం అధ్యక్షుడు, సభ్యులు స్పష్టత ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ఆమోదం తరువాత ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి ఇవ్వడం లేదని చెప్పి, ఆ తరువాత కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా రాయితీను కొనసాగించడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడం కాదా? రాష్ట్ర ప్రజల మనసులో ప్రబలంగా ఉన్న ప్రత్యేక హోదా ఆకాంక్ష అమలు కోసం గత సంవత్సర కాలంగా ధర్మపోరాటాలు చేస్తున్నప్పటికీ, మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తించడం బాధ్యతారాహిత్యం కాదా? :- రాష్ట్రానికి జీవనాడిగా నిలిచే పోలవరం ప్రాజెక్టును యుపీఏ ప్రభుత్వ హయాంలోనే జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, అన్ని అనుమతులూ వచ్చినట్టుగా భావించి అమలు చేస్తామన్నారు. నీతిఆయోగ్ కోరిన మీదట దాన్ని సత్వరమే పూర్తి చేసి సాగునీటి కోసం తపిస్తున్న జిల్లాలకు నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని రాత్రింబవళ్లూ పనులు చేయిస్తున్నది. ఫలితంగా 64% పనులు ఇప్పటికే పూర్తి చేయగలిగాం. కానీ, సకాలంలో నిధులు విడుదల చేయకుండా, పోలవరం రివైజ్డ్ డీపీఆర్‌కు ఆమోదం తెలపకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన సుమారు రూ.4వేల కోట్ల నిధులను తిరిగి చెల్లించకుండా మాపై ఆర్థిక భారాన్ని మోపుతున్నారు.
:- ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విశాఖ రైల్వే జోన్ ప్రకటనను కావాలని వాయిదాల వేస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కోరిన భూమి, గనులు, రాయితీలు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిన్నప్పటికీ కడప ఉక్కు కర్మాగారం ఇంకా ఇవ్వలేదు. :- కేవలం ఆరు మాసాలలో తొలిదశ పూర్తిచేయాలని విభజన చట్టంలో నిర్దేశించినప్పటికీ ఇప్పటికీ దుగరాజపట్నం పోర్టుపై ఏ నిర్ణయమూ ప్రకటించలేదు. రాష్ర్టానికి రావాల్సిన జాతీయ సంస్థల విషయంలో కూడా మీరు అన్యాయమే చేశారు. పలు విద్యా సంస్థలను ఇచ్చినట్టే ఇచ్చి వాటికి సరైన నిధులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. :- ఇలా అరకొర నిధులిస్తే అవి పూర్తిచేయడానికి కనీసం 30 ఏళ్లు పడుతుందనే విషయం మీకు తెలియనిదా..? కాకినాడలో హెచ్‌పీసీఎల్ రిఫైనరీ ప్రారంభించాలని చట్టంలో ఉన్నప్పటికీ కుంటిసాకులతో నిరాకరించడం మా పట్ల మీ నిర్లక్ష్య ధోరణి కాదా? :- ఇటువంటి అనేక అంశాలు, హామీల పట్ల వివక్ష పూరితంగా వ్యవహరిస్తూ మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని గ్రహించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. మేము ఈ రాష్ట్రం నుంచి పన్నులు కడుతున్నాం. మేము ఈ దేశంలో భాగం కాదా? కేవలం రూ.1500 కోట్లతో ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మించడం సాధ్యం అవుతుందా? నీతిఆయోగ్ సిఫార్సు చేసినప్పటికీ వెనుకబడిన ఏడు జిల్లాలకు గాను రాష్ట్ర ఖజానాకు జమచేసిన రూ.350 కోట్లను ఏకపక్షంగా, రాష్ట్ర అనుమతి లేకుండా తిరిగి వెనక్కి తీసుకోవడం భారత సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు కాదా? :- మీరు ఈవిధంగా రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసి ఇప్పుడు తీరిగ్గా రావడం బాధాకరం. ఇంతకాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేస్తున్న ఆందోళన, వారి మనోభావాలు, వారి ధర్మాగ్రహం గమనించండి. అన్నీ తెలిసీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల న్యాయమైన, చట్టపరమైన హక్కులను నెరవేర్చకుండా మొండిచేతులతో రావడం మీకు ధర్మమా? :- కనుక, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుగా గుర్తించి, రాజ్యసభలో అప్పటి ప్రధానమంత్రి ఇచ్చిన రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా హామీని, ఇతర హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే, ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం-2014లోని అన్ని అంశాలను వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నాను" అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ లేఖకు కేంద్రం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాల్సిందే.