రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన సందర్భంగా శాంతిభద్రతలకు భంగం కలిగించరాదని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీస్ అధికారులకు సూచించారు. ఆదివారం టీడీపీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ర్యాలీల్లో రెండు కుండలను పగులకొట్టాలని సీఎం పిలుపు ఇచ్చారు. రెండు కుండలు రెండు పార్టీల లాలూచీకి సంకేతమన్నారు. ఒక కుండ నరేంద్రమోదీ అయితే రెండో కుండ జగన్ అని చంద్రబాబు అన్నారు. ఒక్కరోజైనా మోదీని జగన్ విమర్శించారా? అని ప్రశ్నించారు. ప్రతి నిమిషం జగన్ తనను విమర్శిస్తారని, అన్యాయం చేసిన మోదీని జగన్ ఎందుకు నిందించడంలేదని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఏనాడూ జగన్ పోరాడే పరిస్థితి లేదని విమర్శించారు.
అవిశ్వాసం పెడితే వైసీపీ ఎంపిలతో రాజీనామా చేయించారని, రాజీనామాల ద్వారా మోదీ ప్రభుత్వానికి జగన్ మేలు చేశారని, జాతికి జగన్ క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇవాళ రాష్ట్రమంతా ఒక వైపు పోతుంటే.. జగన్ ఎక్కడ దాక్కున్నాడో ప్రతి ఒక్కరూ నిలదీయాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. రాష్ట్రానికి జగన్ చేసిందంతా డ్రామా అనే ముసుగు.. ఇవాళ్టితో ప్రజలందరికి అర్ధం కావాలన్నారు. ప్రజలంతా మోదీకి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతుంటే.. హైదరాబాద్‌లో దాక్కుని జగన్ కుట్రలు పన్నుతున్నారని చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. మళ్లీ సెంటిమెంట్‌తో ఆడుకోటానికి మోదీ ఏపీకి వస్తున్నారన్నారు. ఏపీ ప్రజలను ఎగతాళి చేయటానికే మోదీ పర్యటిస్తున్నారని చంద్రబాబు అన్నారు. మోదీ పర్యటనను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో నిరసనలు తెలపాలని పిలుపిచ్చారు. రేపటి తన ఢిల్లీ దీక్షకు ప్రజలoదరి మద్దతు తీసుకోవాలన్నారు. సత్యం రామలింగరాజు, మాట్రిక్స్ ప్రసాద్, కోనేరు ప్రసాద్‌లాంటి.. ప్రముఖ వ్యాపారులు నాశనమవటానికి జగనే కారణమని, జగన్ స్వార్థంతో మంచి ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యారని చంద్రబాబు అన్నారు. మోదీ పేదలకు తీవ్రమైన అన్యాయం చేశారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాల్లో నాయకత్వాన్ని దెబ్బతీశారని, మోదీ.. సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచారని సీఎం విమర్శించారు. ఎగతాళి చేయడానికే ఏపీకి మోదీ వస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఒక్క జగన్ పార్టీ తప్ప అన్నిపార్టీలు మోదీ రాకపై నిరసనలు తెలుపుతున్నాయని అన్నారు. జగన్ బీజేపీతో లాలూచీ పడ్డారని, కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో వైసీపీ ఏజెంటని, కన్నా వైసీపీలో చేరబోయి ఆగిపోయిన విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ భరోసాతోనే మోదీ ఏపీకి వస్తున్నారని విమర్శించారు.