నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా హామీని నెరవేరుస్తానన్న హామీ ఏమైందని కేంద్రప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించింది. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఈ హామీని నెరవేర్చాలని విజ్ఞప్తి చేసింది. ఇదే సమయంలో పోలవరం తుది అంచనాలను త్వరితగతిన ఆమోదించాలని డిమాండ్ చేసింది. రాష్ట్రంలోని ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.350 కోట్లు రాష్ట్ర ఖాతాలో వేసినట్లే వేసి వెనక్కి తీసుకున్నారని.. ఈ నిధులు ఏమయ్యాయని నిలదీసింది. మళ్లీ తిరిగి ఎందుకివ్వలేదని ప్రశ్నించింది. వాటిని తక్షణం విడుదల చేయాలని కోరింది. రాష్ట్ర పునర్విభజన సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా ప్రభుత్వం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి మంగళవారం లేఖ పంపించింది.
రాష్ట్ర విభజన నాటికి రెవెన్యూ లోటు రూ.16 వేల కోట్లుగా లెక్క తేలిందని, దీనిలో రూ.3,979 కోట్లే ఇచ్చిన కేంద్రం.. మిగతా నిధులనూ విడుదల చేయాలని అందులో పేర్కొన్నారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలను రాష్ట్రంలో స్థాపించేందుకు అనుమతులు ఇచ్చారని.. కానీ భవన నిర్మాణాలకు నిధులు విడుదలలో జాప్యం జరుగుతోందని గుర్తుచేశారు. విదేశీ సాయంతో నడిచే ప్రాజెక్టులు(ఈఏపీలు)కు భారీగా సాయం అందిస్తామన్న కేంద్రం.. కేవలం రూ.15కోట్లు ఇచ్చి సాయం చేసినట్లు చూపిస్తోందని తెలిపారు. లేఖలోని మరిన్ని అంశాలు... స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్‌పీవీ) ఏర్పాటు చేస్తే ప్రత్యేక హోదా/ప్యాకేజీ ప్రయోజనాలు కల్పిస్తామని.. ఇందుకు రాష్ట్రం సహకరించడం లేదని గతంలో ఆరోపించిన కేంద్రం.. తన నోట్‌లో ఆ ప్రస్తావన ఎందుకు తీసుకురాలేదు?
వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.350 కోట్లు వెనక్కి తీసుకున్న అంశంపైనా ఎందుకు సమాధానమివ్వలేదు? విభజన తర్వాత నవ్యాంధ్రకు ఏర్పడిన రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటులో ఇంకా రూ.12 వేల కోట్లు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాలి. ఈ మొత్తాన్ని ఇస్తామని, ఇచ్చేది లేదని గానీ స్టేటస్ నోట్‌లో స్పష్టత ఇవ్వలేదు. రెవెన్యూ లోటు కోసం రూ.3979 కోట్లే ఇచ్చామని చెప్పింది. మిగిలిన మొత్తంపై మీ నిర్ణయమేంటి? రాష్ట్ర ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై లేనిపోని కొర్రీలు వేస్తూ తుది అంచనాలను ఆమోదించకుండా కాలహరణం చేస్తున్నారు. రాష్ట్ర తాగునీరు, సాగునీరు సమస్యను తీర్చే పోలవరం నిర్మాణానికి కేంద్రం అనుకూలమో కాదో కేంద్రం తేల్చాలి. రాష్ట్రానికి జాతీయ విద్యాసంస్థలు మంజూరు చేశారు సరే.. వాటి నిర్మాణానికి నిధులు ఎందుకివ్వడం లేదు? అందుకు కారణాలేంటో స్పష్టంగా చెప్పాలి.