రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. శరవేగంగా మారిన తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో బాబు ఏప్రిల్ 3, 4వ తేదీలలో దేశ రాజధానిలో ఉండాలని నిర్ణయిం తీసుకున్నారు. ఇటీవల రాష్ట్ర సచివాలయంలో జరిగిన అఖిల సంఘాల భేటీ నేపథ్యంలో జరుగనున్న ఢిల్లీ పర్యటనతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కునన్నాయి. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలను కుదిపేస్తున్న అవిశ్వాస తీర్మానం, మరోవైపు చంద్రబాబునాయుడు జాతీయ రాజకీయ పక్షాలతో నిర్వహించనున్న రాజకీయ భేటీలు హస్తినను వేడిక్కించే అవకాశాలున్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా ఎన్డీయేలో భాగస్వామిగా అధికారిక పర్యటనలు జరిపిన చంద్రబాబునాయుడు, తాజాగా, ప్రతిపక్ష పాత్రను పోషించే దిశగా ఢిల్లీలో అడుగు బెట్టబోతున్నారు.
తన పర్యటనలో భాగంగా అందుబాటులో ఉన్న అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను చంద్రబాబునాయుడు కలుసుకునే విధంగా షెడ్యూల్ ఖరారవుతోంది. ఇప్పటికే తెలుగుదేశం ఎం.పి.లు తొలి దఫాగా కలుసుకుని రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై చర్చించగా, మలివిడతలో ముఖ్యమంత్రి కలుసుకునే విధంగా పర్యటన కార్యక్రమాన్ని టిడిపి నాయకత్వం ఖరారు చేయడంలో నిమగ్నమైంది. ఫెడరల్ ఫ్రంట్ కు బాబు పర్యటన దోహదపడుతుందని భావిస్తున్న నేపథ్యంలో కేంద్ర రాజధాని హస్తినలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 3వ తేదీన ఢిల్లీ బయలుదేరి వెళుతున్న ముఖ్యమంత్రి 4న కూడా వివిధ పార్టీల నేతలతో సమావేశమవుతారు. కాగా అంతటా ఆసక్తి రేపుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో మరోసారి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉంటుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. ఆ అవకాశానికి సంబంధించి ఇప్పటికే బీజం పడగా, అదే స్థాయిలోనే బాబు వ్యూహాత్మకంగా ముందుకు సాగేందుకు రంగం సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది.
1996-2004 సంవత్సరాలమధ్య కాలంలో దేశ ప్రధానిని నియమించే స్థాయిలో బాబు చుట్టూ రాజకీయాలు తిరిగాయి. ఈ సారి కేంద్రంలోని ఎన్డీయేకు మిత్రపక్షంగా ఉంటూ జాతీయ రాజకీయాలలో బిజెపి దూకుడును నియంత్రించడానికి చంద్రబాబుకు మాత్రమే చక్రం తిప్పగల సమర్ధత వుందని భావిస్తున్నారు. ఫలితంగా ఆయన వెంట నడిచే పార్టీల సంఖ్య రోజురోజుకూ పెరిగే అవకాశాలున్నాయి. అధికారంలో ఉన్న మిత్రపక్ష ప్రభుత్వానికే విభజన చట్టంలో పేర్కొన్న హామీలను మోడీ ప్రభుత్వం అమలు చేయడంలేదన్న విషయాన్ని వివిధ మార్గాలలో దేశం మొత్తానికి చెప్పటంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. నవ్యాంధ్రకు మోడీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని సానుకూలంగా మలచుకునేందుకు బిజెపియేతర పక్షాలన్నీ చంద్రబాబుకు అండగా నిలవాలని నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్ కు మోడీ ప్రభుత్వం మొండిచెయ్యి చూపిస్తున్నదంటూ నిరసన వ్యక్తం చేసిన చంద్రబాబు ఆ వెంటనే మోడీ ప్రభుత్వంలో తన పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులను రాజీనామ చేయించడం ద్వారా విపక్షనేతలను ఆలోచింపచేశారు.
రాజకీయ ఎత్తుగడలలో అందెవేసిన చేయిగా ముద్రపడ్డ చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన స్వరూపం పై ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం ఆరా తీయడం ప్రారంభించింది. బాబు ప్రణాళికా రచన ఏ విధంగా వుండబోతోంది అనే దిశగానే ప్రధానంగా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఈమేరకు రాష్ట్ర బిజెపి నేతలు సైతం జాతీయ అధ్యక్షుడు అమిత్షాకు సమాచారమిచ్చినట్టు చెబుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన, అభిలసంఘాల సమావేశం, భవిష్యత్ కార్యాచరణ వంటి పలు అంశాలపై కూడా బిజెపి నేతలు జాతీయ నాయకత్వానికి నివేదించారు.