ఇసుజు, కియా, హీరో హోండా.. ఇప్పుడు అశోక్ లేలాండ్... ఇది చంద్రబాబు సారధ్యంలో, ఆటోమొబైల్ హబ్ గా నవ్యాంధ్ర తయారవుతున్న తీరు... ఈ రోజు, కృష్ణా జిల్లా మల్లవల్లి గ్రామ సమీపంలోని ఆదర్శ పారిశ్రామిక పార్క్‌లో అశోక్ లేలాండ్ బస్ బాడీ బిల్డింగ్ కర్మాగారానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. 135 కోట్ల పెట్టుబడితో 75 ఎకరాల్లో ఈ కంపెనీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కంపెనీ ఏర్పాటుతో 2,295 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 4800 బస్సుల తయారీ సామర్థ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు జరగనుంది..
శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ ఇవాళ నూతన చరిత్రకు శ్రీకారం చుట్టాం. బ్రిటిష్ కాలంలోనూ మల్లవల్లి ..పరిటాల నిజాం పాలనలో ఉండేది. ఈ ప్రాంతంలో అటవీ భూములను కాపాడుకున్న ఘనత స్థానికులకే దక్కింది. కొంతమంది అడ్డంకులు సృష్టించాలని చూసినా, ఎంతో స్ఫూర్తితో, నాపై నమ్మకంతో రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములు ఇచ్చారు. మల్లవల్లిలో కర్మాగారం నిర్మాణానికి రైతులు 1160 ఎకరాలు ఇచ్చారు. ఇక్కడికి 802 యూనిట్లు వస్తాయి.’ అని అన్నారు.
అశోక్‌లేలాండ్ ఎండీ వినోద్ దాసరి మాట్లాడుతూ... ఈ ఏడాది అశోక్‌లేలాండ్ 70వ వార్షికోత్సవం జరుపుకొంటోంది. సీఎం కోరిక మేరకు ఏపీలో యూనిట్ పెట్టాలని నిర్ణయించాం. ప్రభుత్వ సహకారం కారణంగానే త్వరగా శంకుస్థాపన చేసుకుంటున్నాం. ఈ ప్లాంట్‌లో బస్సులు, ట్రక్కులు, ఎలక్ట్రిక్ వాహనాలు ఉత్పత్తి చేస్తాం. మేం ఇక్కడ ఉద్యోగాలను కల్పించడమే కాకుండా.. ఆత్మవిశ్వాసం కలిగిన ఉద్యోగ యువతను ఆంధ్రప్రదేశ్‌కు అందివ్వబోతున్నాం. నేను కృష్ణా జిల్లా వాడిని కాబట్టి ఇక్కడే ప్లాంట్ పెడతానని సీఎంకు చెప్పా. యూనిట్ పరిపాలన భవనం అమరావతి స్తూపంలానే ఉంటుంది. 6 నెలల్లో తొలి బస్సు తయారు చేసి సీఎం చేతులమీదుగా ప్రారంభిస్తాం’’ అని వినోద్ దాసరి మాట ఇచ్చారు.