కేంద్రం రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం పై, ఇన్నాళ్ళు ఎంపీల చేత ఆందోళన చేపిస్తూ, వివిధ మార్గాలలో కేంద్రం పై ఒత్తిడి తెచ్చిన చంద్రబాబు, ఇక ప్రజల ముందు వాస్తవాలు ఉంచారు... బహిరంగంగా, కేంద్రం పై చంద్రబాబు నిరసన వ్యక్తం చెయ్యటం ఇదే మొదటిసారి... శనివారం ఆయన గుంటూరు జిల్లా కాకాని వద్ద రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జేఎన్టీయూ భవనాలకు శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు... ఆ సమయంలో కేంద్రం పై నిరసన వ్యక్తం చేసారు... చంద్రబాబు మాట్లాడుతూ "రాష్ట్రానికి న్యాయం జరుగుతుందనే బీజేపీతో పెత్తు పెట్టుకున్నామని, కానీ ఆ పార్టీ అభివృద్ధిలో సహకరించడం లేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
29 సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసిన స్పందన రాలేదని ఆయన వాపోయారు. అన్నీ సందర్భాల్లో ఏపీకి జరిగిన అన్యాయం గురించి చెప్పానని, అయినా ఇప్పటికీ న్యాయం జరుగలేదని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సరైన కేటాయింపులు లేవన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామాలన్నింటినీ నెరవేర్చాల్సిందేనని డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకు న్యాయం చేయాలని కోరారు. ఆ రోజు ఇచ్చిన హామీలన్నంటినీ నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్టు పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. అందరి సహకారంతో రాష్ట్ర హక్కులను సాధించుకోవాలన్నారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాల్సిందేనని సీఎం అన్నారు.
రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నిరుత్సాహ పడితే ఏం చేయలేమని చంద్రబాబు అన్నారు. విభజన తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపులేకపోతున్నామని.. నవనిర్మాణ దీక్ష చేస్తున్నామన్నారు. హక్కుల కోసం ఎక్కడా రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. ఇది ఐదు కోట్ల జనాభాకు, కేంద్రానికి సంబంధించిన విషయమని తెలిపారు. హామీలన్నీ నెరవేర్చాలని ఐదు కోట్లమంది ప్రజల తరఫున మరోసారి డిమాండ్ చేస్తున్నానని అన్నారు. చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నామని చంద్రబాబు అన్నారు. హేతుబద్ధతతో విభజన జరిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదు.