కేంద్ర మంత్రివర్గంలో తమకు కోరిన స్థానాలు ఇవ్వకపోవడంపై అసంతృప్తిగా ఉన్న బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నీతీశ్ కుమార్ అందుకు తనదైన శైలిలో స్పందించారు. రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించి అందులో తమ పార్టీకి చెందిన 8 మంది నేతలకు మంత్రి పదవులను కట్టబెట్టారు. ఇదే ప్రభుత్వంలో భాగంగా ఉన్న భాజపాకు మాత్రం ఒక్క స్థానాన్ని కేటాయించారు. ఈ పదవిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని భాజపా నేతలు తెలిపారు. ఇటీవల భాజపా నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం భారీ మెజారిటీతో తిరిగి అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. బిహార్‌లో చెరో 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయగా.. భాజపా 17, జేడీయూ 16 స్థానాల్లో గెలుపొందాయి. కొత్తగా ఏర్పడిన కేంద్ర కేబినెట్‌లో తమకు ఒక్క పదవినే కేటాయించడంపై నీతీశ్ కుమార్ అసంతృప్తి వ్యక్తంచేస్తూ మంత్రివర్గంలో చేరేందుకు నిరాకరించారు.
దీనికి ప్రతీకారంగానే రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరించి తమ పార్టీ నేతలకు అధిక స్థానాలను కేటాయించారని తెలుస్తోంది. బహిరంగంగా విమర్శించనప్పటికీ పలువురు భాజపా నేతలు సైతం ప్రతీకారంలో భాగంగానే మంత్రివర్గ విస్తరణ చేపట్టారని పేర్కొంటున్నారు. అయితే, తాజా మంత్రివర్గ విస్తరణపై నీతీశ్ కుమార్ స్పందిస్తూ.. తమకు ఎన్డీయేతో ఎలాంటి విభేదాలూ లేవని మీడియాకు తెలిపారు. ముందుగా అనుకున్నట్లుగానే ఖాళీగా ఉన్న మంత్రి పదవులను తమ పార్టీ నేతలకు కేటాయించామని చెప్పారు. బీహార్‌లో పోటీ చేసిన 17 లోక్‌సభ స్థానాల్లో 16 స్థానాలు కైవసం చేసుకుని తమ పార్టీ సత్తా చాటితే.. కేంద్రం మాత్రం సరైన ప్రాధాన్యం కల్పించలేదని నితీష్ సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది.