వెలగపూడి సచివాలయం నిర్మాణానికి చదరపు అడుగుకు రూ.11,000 వెచ్చించారని ప్రభుత్వ విశ్రాంత ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన అజేయ కల్లం చెప్పడం ఆయన విశ్వసనీయతను పోగొట్టుకోవడమేనని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు విమర్శించారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం సాయంత్రం కుటుంబరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సచివాలయం 45 ఎకరాల్లో ఆరు భవనాలుగా నిర్మించామని, ఈపీసీ విధానంలో మొత్తం 3 ప్యాకేజీలుగా అప్పజెప్పామన్నారు. మొత్తం 6,20,000 చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టామన్నారు. ప్రస్తుతం ఒక అంతస్తు నిర్మించినా ఏడంతస్తులకు వీలుగా పునాది వేయించామని చెప్పారు.
చదరపు అడుగుకు రూ.2,312 ఖర్చుచేశామని చెప్పారు. భవనాల్లో పర్యావరణహిత ఏర్పాట్ల కారణంగా చదరపు అడుగుకు రూ.3521.61 ఖర్చయిందన్నారు. మొత్తంమీద రూ.5,834 వెచ్చించామని కుటుంబరావు చెప్పారు. మొబైల్ ఫోన్లు ఎక్కడ కొన్నామో, ఎవరికి పంచామో, రూ.450కోట్ల విలువైన భూములు ఎవరికి ఇచ్చేశామో ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. రాజధానిలో రూ.10వేల కోట్ల పన్ను ఎగవేశారని భాజపా నేత జీవీఎల్ చెబుతున్నారు, మీ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పన్నుల వసూళ్లకు మినహాయింపు ఇవ్వటం తెలియదా అని ప్రశ్నించారు.
హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్‌ది కాదంటూ ప్రారంభమైన కొత్త నాటకంలో పాత్రధారులు ఎవరో బయటపడుతుందని, వ్యవహారం అరెస్టుల వరకు దారితీయవచ్చని కుటుంబరావు చెప్పారు. హాయ్‌ల్యాండ్ తనదే అంటూ బయటకొచ్చిన అలూరి వెంకటేశ్వరరావు ఆర్కాలీజర్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎండీ అని చెప్పారు. అది కూడా అగ్రిగోల్డ్ సంబంధిత సంస్థే అని చెప్పారు. 2015 జనవరిలో ఆదాయపుపన్ను శాఖకు సమర్పించిన పత్రాల్లో రూ.146 కోట్లను ఆర్కాలీజర్‌కు బదలాయించిన విషయాన్ని ప్రస్తావించారని, అగ్రిగోల్డ్ ఆర్థిక వ్యవహారాలు చూసే ఉపాధ్యక్షుడు దాన్ని స్పష్టంగా పేర్కొన్నారని కుటుంబరావు వివరించారు.