రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని బుధవారం రాత్రి సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా రాజధానిలో భూములు పొందిన వివిధ సంస్థల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా, వివధ సంస్థల ప్రతినిధులు ప్రెజంటేషన్ ఇచ్చారు. జంషెడ్‌పూర్‌లోని ప్రఖ్యాత ‘జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్’ అమరావతిలో ఎక్స్ఎల్ఆర్ఐ వర్శిటీ ఏర్పాటు చేస్తోంది. 2500 మంది విద్యార్ధులు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులకు, మరో 2500 మంది విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు అవకాశం కల్పిస్తామని జేవియర్ ప్రతినిధి ముఖ్యమంత్రికి వివరించారు. నీరుకొండ సమీపంలో 50 ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణాలను చేపడుతున్నట్టు తెలిపారు. మొత్తం నిర్మాణంలో 47 శాతం ఓపెన్ స్పేస్‌గా వుంచుతున్నామని చెప్పారు.
వచ్చే ఏడాది నుంచే తరగతులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎక్స్ఎల్ఆర్ఐ ప్రతినిధికి సూచించారు. భవన నిర్మాణ పనులను ఇప్పటికే ప్రారంభించామని, సాధ్యమైనంత వేగంగా నిర్మాణాన్ని పూర్తిచేసి తరగతులను ప్రారంభిస్తామని అమృత వర్శిటీ ప్రతినిధి ముఖ్యమంత్రికి చెప్పారు. వచ్చే నెలలో భవన నిర్మాణానికి పునాదిరాయి వేస్తున్నట్టు ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ ప్రతినిధి ముఖ్యమంత్రికి వివరించారు. ఏడాదిలోగా మొత్తం నిర్మాణాన్ని పూర్తిచేసి వైద్య సేవలు ఆరంభిస్తామని తెలిపారు. వచ్చే జనవరిలో నిర్మాణాన్ని ఆరంభించి 18 మాసాల వ్యవధిలో హోటల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని దసపల్లా ప్రతినిధికి ముఖ్యమంత్రి సూచించారు.
భవంతుల నిర్మాణాలను పూర్తిచేసి 2019 నాటికి తరగతులను ప్రారంభిస్తున్నట్టు ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతినిధి చెప్పారు. మొత్తం 9 బ్లాకులుగా ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టినట్టు బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ప్రతినిధి వివరించారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించిన ఆర్కిటెక్చరల్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. 7 లక్షల చదరపు అడుగుల మేర నిర్మాణం జరిపిన భవంతులలో ఈ ఏడాది 20 రాష్ట్రాల నుంచి వచ్చిన 1200 మంది విద్యార్ధులు ప్రపంచ ప్రమాణాలతో కూడిన విద్యను అందుకుంటున్నారని ఎస్ఆర్ఎం విశ్వవిద్యాలయం ప్రొ.వీసీ సత్యనారాయణ ముఖ్యమంత్రికి వివరించారు.