కేసరపల్లి 'మేధ' ఐటీ టవర్లోకి మరో పరిశ్రమ వచ్చి చేరింది. జెమిని కన్సల్టింగ్ సర్వీసెస్ (జీసీఎస్) కంపెనీ ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తన శాఖను ఆదివారం ఏర్పాటు చేసింది. రాష్ట్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణరావులు జీపీఎస్ నూతన శాఖను ప్రారంభించారు. తొలుత వందమందికి స్థానికంగా ఉపాధి కల్పించింది. విభజన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతంలో ఐటీ పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేస్తున్న ఏపీ ఎన్ఆర్టీ సంప్రదింపులతో ఏర్పాటు చేసిన తొలి సంస్థగా జీసీఎస్ నిలిచింది.
వివిధ కేటగిరీలకు సంబంధించి వ్యాపార కార్యకలాపాలకు అవసరమైన సాఫ్ట్ వేర్స్ ను ఈ సంస్థ తయారు చేసి అందిస్తుంది. ప్రపం చవ్యాప్తంగా ఉత్తర అమెరికా, మధ్య తూర్పు భారతదేశంలో తన శాఖలతో విస్తరించి అత్యుత్తమ సాఫ్ట్ వేర్ ఉత్పత్తులను అందిస్తోంది. బహ్రయిన్, కువైట్, దుబాయ్, ఒమన్ వంటి దేశాలతో పాటు భారతదేశంలో హైదరాబాద్, భువనేశ్వర్లలో శాఖలను విస్త రించిన జీపీఎస్ అమరావతి రాజధాని ప్రాంతంలో తొమ్మిదో శాఖను ఏర్పాటు చేసింది. వాస్తవానికి తొమ్మిదో ఈ శాఖ విశాఖలో ప్రారంభించాలని యాజమాన్యం భావించింది.
బాపట్ల ఇంజనీరింగ్ కాలేజీలో విద్యారులకు నైపుణ్య శిక్షణ అందించటం ద్వారా వారిలో ప్రతిభా సంపత్తిని వెలుగులోకి రావడంతో రాజధాని ప్రాంతంలో వారికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్న సంకల్పంతో ఇక్కడ సంస్థను ఏర్పాటు చేయటానికి నిర్ణయించింది. ముందుగా నైపుణ్య శిక్షణ ద్వారా ఎంపిక చేసుకున్న వందమందికి ఉద్యోగాలు కల్పించింది. వర్కింగ్ గ్రూపులు, ఛాంబర్లు, వర్క్ స్టేషన్లు, అధునాతన కంప్యూ టర్లు, హై ఎండ్ స్పీడ్ ఇంటర్ నెట్ వంటి సదుపాయాలను కల్పించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ బ్రాంచి ద్వారా పెద్ద ఎత్తున సాఫ్ట్ వేర్ ఉత్పత్తులను ఎగుమతి చేయటం ద్వారా వృద్ధి సాధించగలమన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. జీసీఎస్ కంపెనీ ఐఎన్ సీ-5000 గుర్తింపును పొందింది. ప్రైవేటు ఐటీ పరిశ్రమలలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలలో ఒకటిగా 2014, 2015, 2016 సంవత్సరాలలో నిలిచింది.