ఏంటి ? చంద్రబాబుకే సమస్య ఎలా పరిష్కరించాలో అర్ధంకాక పోవటం ఏంటి అనుకుంటున్నారా ? అవునండి... ఇది నిజం... పేద వర్గాలకు పెళ్లి కానుక పేరుతో అమలావుతున్న పధకం మీద ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది... నిన్న చంద్రబాబు నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఒక సమస్య లేవనెత్తారు... దానికి చంద్రబాబు కూడా ఆలోచనలో పడ్డారు... సీనియర్లు కూర్చుని చర్చించి పరిష్కారం కనుక్కోవాలని సూచించారు... ఇంతకీ సమస్య ఏంటి అంటే, ముస్లిం మైనారిటీలకు దుల్హన్ పేరుతో, హిందువుల్లోని పేద వర్గాలకు పెళ్లి కానుక పేరుతో అమలవుతున్న పధకం పై, డబ్బులు ఎవరకి ఇవ్వాలి అనేది...
గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీశ్ ఈ అంశం లేవనెత్తారు. ‘దుల్హన్ కానుక మాకు చెందాలంటే మాకు చెందాలని కొన్ని కుటుంబాల్లో తగాదాలు జరుగుతున్నాయి. పెళ్లి ఖర్చుల కింద ఇస్తున్నారు కాబట్టి తాము తీసుకుంటున్నామని అమ్మాయి పుట్టింటివారు చెబుతున్నారు. అమ్మాయి కోసం ఇస్తున్నారు గనుక మాకు చెందాలని అత్తింటివారు పట్టుబడుతున్నారు. ఈ తగాదా తీర్చాలని మా వద్దకు వస్తున్నారు. ఏం చెప్పాలో పాలు పోవడం లేదు. ఈ సమస్యను మీరే పరిష్కరించండి’ అని ఆయన కోరారు.
టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నవారు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇచ్చేది పెళ్లిఖర్చుల కోసం కాబట్టి వధువు పుట్టింటివారికే ఆ డబ్బు చెందుతుందని కొందరు... అమ్మాయికి ఇస్తున్నాం కాబట్టి ఆ అమ్మాయితో పాటు అత్తవారింటికే వెళ్తుందని కొందరు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏ అభిప్రాయం వ్యక్తం చేయలేదు. సీనియర్లు కూర్చుని చర్చించి పరిష్కారం కనుక్కోవాలని సూచించారు.