జన్మభూమి- మా ఊరు వేదిక పై అంగన్ వాడి చిన్నారులు, మున్సిపల్ కాలేజీ విద్యార్ధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరదాగా గడిపారు. క్షణం తీరికలేకుండా ఎప్పడూ బిజీ షెడ్యూల్ తో ఉండే ఆయన శనివారం పొట్టి శ్రీరా ములు నెల్లూరు జిల్లాలోని కోడూరుపాడులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో చిన్నారుల ప్రసంగానికి, కాలేజి విద్యార్థుల దీనగాథకు చలించి వారి పై ప్రశంసల జల్లుతో పాటు ఆర్థికపరమైన వరాలు కూడా కురిపించారు. జన్మ భూమి గ్రామ సభలో పాల్గొనేందుకు 2.10 గంటలకు సభాప్రాంగణానికి చేరుకున్న ఆయన 20 నిమిషాలపాటు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్ ను పరిశీలించారు.
తరువాత చంద్రబాబు 20 నిమిషాల పాటు ప్రసంగించారు. జన్మభూమి కార్యక్రమం ఉద్దేశం, ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించిన ఆయన బలిజపాళెం అంగన్ వాడి చిన్నారులతో కొంతసేపు ముచ్చటించారు. ఆయన 3 నుంచి 5 ఏళ్లల్లోపు వయసు కలిగిన చిన్నారులతో మన జాతీయ జెండాను ఎవరు రూపొందించారు, జాతీయ గీతం ఏమిటి, భారతదేశ మొదటి ప్రధాని ఎవరు, జాతీయ గీతాన్ని ఎవరు రచించారు, అడవులు ఎక్కువగా ఉండే రాష్ట్రం ఏది, భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అంటూ ఆ చిన్నారులను ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. ఆయన అడిగిన అన్ని ప్రశ్నలకు చిటికెలోనే ఆ చిన్నారులు సమాధానం చెప్పి ముఖ్యమంత్రితో పాటు సభికులను ఆశ్చర్యపరిచారు.
దీంతో వారి ముద్దుముద్దు సమాధానాలకు ముగ్ధులైన సీఎం ఆ చిన్నారులను భుజంపై ఎత్తుకుని అభినందించి అంత చిన్న వయసులోనే వారి మేధాశక్తికి మరింత పదును పెడుతున్న అంగన్ వాడి టీచర్ ను వేదిక పై పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. అంతటితో ఆగకుండా మీకు ఏంకావాలంటూ ఆ చిన్నారులను ప్రశ్నించడంతో అక్కడే ఉన్న టీచర్ తమకు సరైన భవనం లేదని చెప్పింది. దీంతో ఆయన బలిజపాళెం అంగన్వాడి కేంద్రాన్ని ఆదర్శ కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రూ.20లక్షలను ప్రకటించారు. అదేవిధంగా అంగన్వాడి టీచర్ పని తీరును ప్రశంసిసూ ప్రభుత్వం తరపున రూ.25 వేల పారితోషికం ప్రకటించారు...